Friday, January 29, 2010

వి"చిత్ర"కారిణి

అది ఇరవై ఒకటో శతాబ్ధపు తొలి స౦వత్సరాల్లోని చివరి నెలల్లో ని ఓ రోజు

ఆహా ఇ౦త కన్నా గొప్ప గెలుపు ఇ౦కోటి లేదు ఇప్పటి వరకు నా జీవిత౦ లో , సుధ నా కాళ్ళు నొక్కుతూ , నేను దాన్ని గేలి చేస్తూ , అది కిమ్మనకు౦డా ముఖ్య౦గా నన్ను కొట్టకు౦డా నా కాళ్ళు నొక్కుతూ ఉ౦టే best horrifying
actor విభాగ౦ లో మా ఇంటర్ ప్రిన్సిపాల్ కి oscar award వచ్చినంత హ్యాపీగా ఉ౦ది నాకు ......

అ౦త మధురాతి మధురమైన నా కల ని నేను ఆస్వాదిస్తు౦డగా కర్ణభేరి పక్కన మిక్సీ లో ఓ పది కిలోల రాతి పలకలని వేసి రుబ్బినట్టు ఎదో శబ్ధానికి మెలుకువ వచ్చి౦ది , ఆ శబ్ధ౦ తాలూకా గాత్ర౦ ఎవరిదో తెల్సుకోటానికి ఎక్కువ సమయం పట్టలేదు నా సిమెంటు బుర్రకి, ఈ భూప్రపంచంలో ఎ ఆయుధాలూ లేకుండా కేవలం తన గాత్రం తోనే అతి కిరాతకంగా ఖూనీ చేయగల్గిన సత్తా కేవలం మా బామ్మకే ఉంది . అర్ధరాత్రి 8.30 am కే నిద్ర లేపినందుకు బామ్మకో lesson నేర్పుదాం అనుకున్నాను ..... ఎలాగైనా సరే photoshop లో బామ్మ ఫోటో ని మినీ స్కర్టు వేసుకున్నట్టు ఎడిట్ చేసి ఆ ఫోటో ని ప్రింట్లు తీసి తన బామ్మల బ్యాచ్ స్నేహితురాళ్ళకి పంచిపెట్టి తన పరువు INDIAN OCEAN లో కలిపెయ్యాలని కంకణం కట్టేసుకున్నాను ......

గోడ గడియారం తొమ్మిది కొట్టింది , అప్పుడు కానీ వెలగలేదు నాకు ఇవ్వాళ కాలేజి మొదటి రొజు అని , నేను తొమ్మిది కల్లా కాలేజీ లో ఉండాలని . టైము కి వెళ్ళలేక పోయానే అన్న భాధ , సుధ మీద కోపం ఒకేసారి వచ్చాయి .

హాల్లో ఉన్న సుధ దెగ్గరికి వెళ్ళి " ఎందుకని నన్ను లేపలేదు ???? త్వరగా వెళ్ళాలి కాలేజీకి లేపు అని చెప్పానుగా నీకు " అన్నాను .
సుధ వెంటనే " నువ్వు ఓడిపోయావు , నా వంద నాకివ్వు "అంది

అప్పుడు అర్ధం అయ్యింది , రాత్రి మేమిద్దరం గొడవ పడి మాట్లాడుకోకూడదనుకున్నామని , ముందుగా మాట్లాడిన వాళ్ళు మిగిలిన పార్టిసిపెంట్ కి వంద సమర్పించుకోవాలని . వెంటనే వందిచ్చి ఎందుకు లేపలేదని అడిగాను .

" నువ్వు రాత్రి నన్ను ఐదింటి కల్లా లేపు అని చిట్టి రాసి నా పక్కన పెట్టినట్టే, పొద్దున్నే నేను కూడా అక్కా ఐదు అయ్యింది నిద్రలే అని చిట్టి రాసి నీ పక్కనే పెట్టానే చూసుకోలేదా ???? " అ0ది

Antartica లో అరిటాకుల బిజినెస్ చేసి దివాలా తీసిన వ్యాపారిలా అక్కడినుంచి వెళ్ళిపొయాను .

నా టాలెంట్ మీద తనకున్న నమ్మకాన్ని ఆధారం చేసుకుని నాకు ఎలాగూ సీటు దొరకదు అని పది రూపాయల హెవీ బెట్టింగు కట్టి , తద్వారా వచ్చే ఆ డబ్బుతో లైఫ్ లో సెట్టిల్ అవ్వాలన్న పక్కింటి బాలు ప్లాను మట్టి పాలై , ఓడిపోయానన్న పిచ్చిలో తన చొక్కా అనుకుని పక్కింటి అంకుల్ చొక్కా వేసుకున్నాడు , ఈ నేరం మీద పాపం బాలు ని బాల నేరస్తుల కళాశాలలో వేసారు వాడి అమ్మా , నాన్న .

అస్సలు దేశం లో ఏ engg కాలేజీలోను సీటు రాదనుకున్న నాకు , పిలిచి మరీ సీటు ఇచ్చినందుకుగాను , బాగా చదివి మా బెంచి ఫస్టు తెచ్చుకొని కాలేజీ పరువు నిలబెట్టాలనుకున్నాను .

నానా ఇక్కట్లు పడి కాలేజీ కి చేరుకున్నాను . యమలోకం ఎంట్రెన్సు దెగ్గర కాపలా కాసే యమకింకరుల్లా ఇద్దరు సీనియర్స్ , జూనియర్స్ కోసం గేటు దెగ్గ్గరే నిల్చొని ఉన్నారు . వాళ్ళు నన్ను పిలవకూడదు అని ముక్కోటి దేవతలకు , వాళ్ళ పిల్లలకు , వాళ్ళ చుట్టాలకు , మొత్తం వాళ్ళ వంశానికి మొక్కుకున్నాను. ఆ దేవుళ్ళు ఈటీవీ లో వచ్చే సుమన్ అంతులేని సీరియల్ చూడటంలో బిజీగా ఉన్నారో ఏంటో కర్మ , ఆ సీనియర్స్ నన్ను చూడటం , పిలవటం జరిగిపోయాయి . నా మొర ఆలకించనందుకుగాను , నీటి పంపుల దెగ్గర అమ్మలక్కల గొడవలు , పక్కింటి మీద చెత్త వేసినందుకు గొడవపడటం లాంటి భయంకరమైన గొడవలని డీల్ చేసే మా స్ట్ర్రీట్ కోర్టు లో వాళ్ళ మీద కేసు వేద్దం అనుకున్నాను .

గాడ్జిల్లాకి ప్యాంటు , చొక్కా వేసినట్టు ఉన్న ధర్మా రావు దెగ్గరికి వెళ్ళాను . పేరుకి తగినట్టే ధర్మ బద్దంగా నా పేరు , ఊరు అడిగి వదిలేస్తాడేమో లే అనుకున్నాను , తరువాత తెలిసింది పేరులో మాత్రమే ధర్మం ఉన్న అధర్మ పరుడు ఆ గాడ్జిల్లా అని......

"ఇదిగో అమ్మాయ్ నీ పేరు , ఊరు నాకు అనవసరం కానీ అదిగో ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమని వర్ణిస్తూ ఓ పాట పాడు" అన్నాడు తనలో పదో వంతు బరువు తూగని పావని వైపు చూపిస్తూ .......

అంటే సార్ నాకు మీ ప్రేమ గురించి ఏమి తెలీదు కదా అన్న నా ప్రశ్న పూర్తి కాకుండానే నిప్పులు తొక్కిన నక్క లా ఓ చూపు చూసి " సరేలే నాకు పావని కి పెళ్ళి అనుకో , ఇప్పుడు పాడు మా పెళ్ళి గురించి ఓ మాంచి పాట " అన్నాడు .

వెంటనే నేను " పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం , కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢ లోకం " అని పాడేశాను .

పక్కవాడి నోట్సు అనుకుని తన నోట్సు చింపేసుకుని ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయి , సైకిల్ కొట్లో సెల్స్ కిడ్ గా పని చేసుకుంటుండగా , recession పుణ్యమా అని ఆ సెల్స్ కిడ్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న నిరుద్యోగిలా కోపంగా , చిరాగ్గా చూసాడు .

అయ్యో , ఏం అవుతుందో ఏంటో అని నేను అంతర్మథనం చెందుతుండగానే నాకు punishment ఏంటో చెప్పేశాడు

దీని బదులు నన్ను లావు అవ్వమన్నా పెద్దగా బాధ పడకపోయేదాన్నేమో , నా చేత కాలేజీ రోడ్దు మీద తుక్కుడు బిళ్ళా టెన్ టైమ్స్ వితౌట్ మిస్టేక్స్ ఆడించాడు , అవమానం భరించలేకపోయాను , ఇంటికెళ్ళి సుధ తో మాంచి ప్లాన్ వెయ్యాలి, ధర్మా రావు మీద పగ తీర్చుకోటానికి అనుకున్నాను .....

సాయంత్రం ఇంటికెళ్ళగానే " అమ్మా సుధ ఎక్కడా ?? " అన్నాను
" ఇవ్వాళ దానికి నేను ఉప్మా చేసి పెట్టలేదు అని అలిగి పొద్దున్నించి అదిగో ఆ రూము లో కూర్చుని hunger strike చేస్తోంది " అని రూము వైపు చూపించింది

అయ్యో పాపం చేసివ్వల్సిందే , పొద్దున్నించి తినకపోతే ఆరోగ్యం పాడవుతుందే అనే నా వాక్యం పూర్తయ్యే లోపు
"అమ్మా ఎంతసేపే , త్వరగా తినటానికి ఏదన్నా చేసి తీసుకురా , ఎప్పుడో పావు గంట క్రింద తిన్నాను " అన్న అరుపు వినిపించి అమ్మ వైపు చూసాను

Hunger strike అంటే దాని dictionary లో ఆకలి బంద్ కాదు ఆకలి కే బంద్ అని అర్దం చేసుకుని , తన దెగ్గరికి వెళ్ళి " సుధ ఇవ్వాళ నన్ను ఒకతను నిండు కాలేజీలో అవమానించాడు , తన మీద పగ తీర్చుకోటానికి ఏదన్నా ప్లాన్ వెద్దాం " అన్నాను .....

"కాలేజీలో చేరి ఒక్క రోజు కూడా కాలేదు , అప్పుడే ప్లాన్ ఎలా గీయగలవు , నా మాట విని ఎదురింటి యశ్వంత్ అన్నయ్య , సివిల్ engg ఆయనతో ప్లాను గీయించు " అన్న ఓ costly సలహా విసిరింది .....

దాని తెలివికి నా చెవుల్లో నుంచి కన్నీటి ధార మొదలయ్యింది , ఇంకా అక్కడే ఉంటే మతి చెడి ధర్మా రావుకి ప్రేమ లేఖ రాసే ప్రమాదం ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాను . లాభం లేదు నా దెగ్గర ఉన్న ముప్పై రెండు కళల్లో ని అతి భయంకరమైన నా చిత్ర కళ ని ధర్మి గాడి మీద ప్రదర్శించాల్సిందే అని బొమ్మ గీసేసాను ......

పొద్దున్నే కాలేజీకి నా కళాఖండాన్ని తీసుకెళ్ళి , దాన్ని display board లో పెట్టమని లంచంగా నా pocket మనీ , orange బిళ్ళలు కొనుక్కోటానికి సుధ పరుపు కింద దాచుకున్న డబ్బులు మొత్తం మూడు రూపాయల ముప్పయి పైసలు , వారం పాటు నా లంచ్ బాక్సు , ఇవే కాకుండా బామ్మ చేత చెగోడీలు , అరిసెలు , గవ్వలు చేయించి తెచ్చి ఇవ్వటం లాంటి ఆకట్టుకునే పథకాలను ప్రకటించాక గానీ ఒప్పుకోలేదు ఆ ప్యూను పరాంకుశం .
ఆ కళాఖండం ఇదే:


ఆ బొమ్మని చూసిన ధర్మా రావు , తనకి కప్పం కట్టాల్సిన ప్రజలే తనని వెన్ను పోటు పొడిచినప్పుడు , చేసేది లేక ఓటమిని అంగీకరించిన రాజు లాగా , నా దెగ్గరకు వచ్చి " ఇంకెప్పుడు రాగ్యింగ్ చేయను , దయ చేసి ఆ బొమ్మ తీసేసి నా పరువు కాపాడు " అన్నాడు .

రవి వర్మ ని కూడా చిత్ర కళ లో ఓడించగల్గిన సమర్దత , సత్తా నాకు తప్ప ఇంకెవ్వరికీ లేవని మా వాళ్ళంతా ఆ రోజు నుంచి ఫిక్స్ అయిపోయారు . అప్పటినుంచి కాలేజీ బస్ లో తనకి కూర్చోటానికి సీటు లో చోటు ఇవ్వలేదని స్రావణి బొమ్మ వేసిమ్మని ప్రణీత , ప్రశాంత్ బండి మీద తనకి లిఫ్ట్ ఇవ్వలేదని ప్రశాంత్ బొమ్మ వేయమని శ్వేత , హాఫ్ డే లీవ్ ఇవ్వనన్నాడని ప్రొఫెసర్ బొమ్మ వేయమని కార్తీక్ , తను మూడేళ్ళుగా ప్రేమిస్తున్న అమ్మాయి తనని అన్న అని పిలిచింది అన్న కోపంతో ఆ అమ్మాయి బొమ్మ వేయమని సుధీర్ , ఇలా జనాలు వాళ్ళ వాళ్ళ పగ , ప్రతీకారాలు తీర్చుకోటానికి నా దెగ్గరికి వచ్చేవాళ్ళు .

అల రోజులు గడిచే కొద్దీ , కాలేజీ లో నా పేరు నలు మాలలా వ్యాప్తి చెంది చివరికి తనని HOD ని చెయ్యలేదని చైర్మెన్ గారి బొమ్మ వేసిమ్మని ప్రొఫెసర్ గారు రహస్య గూఢాచారుల ద్వారా సమాచారం పంపించటం తో నాకు వి"చిత్ర"కారిణి అన్న బిరుదు ప్రకటించారు ....
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution 2.5 India License.